ఉద్యోగాలపై ఏఐ సునామీలా ప్రభావం చూపనుంది: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా

జాబ్ మార్కెట్‌పై ఈ టెక్నాలజీ సునామీలా విరుచుకుపడుతుందని ఆమె తెలిపారు.

Update: 2024-05-14 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: జాబ్ మార్కెట్‌పై కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. భవిష్యత్తులో ఏఐ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందని, మొత్తంగా జాబ్ మార్కెట్‌పై ఈ టెక్నాలజీ సునామీలా విరుచుకుపడుతుందని ఆమె తెలిపారు. జ్యూరిచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన క్రిస్టాలినా.. మరో రెండేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో కీలకమైన మార్పులను మనం చూడనున్నాం. ఏఐ ప్రభావం కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలు కనుమరుగు అయ్యే ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది 40 శాతం వరకు ఉంటుందని ఆమె అంచనా వేశారు. అయితే, ఈ మార్పులను అంగీకరించేందుకు తక్కువ సమయం ఉన్నందున ప్రజలు, కంపెనీలు అందుకనుగుణంగా సిద్ధమవ్వాలి. ఏఐ టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే కొన్ని రంగాల్లో ఉత్పాదకత పెరిగి సామర్థ్యం మెరుగుపడవచ్చు. ఒకవేళ ఏఐని సరిగ్గా వినియోగించుకోకపోతే నకిలీ సమాచారం వ్యాప్తి చెందడమే కాకుండా ఆదాయ అసమానతలు విపరీతంగా పెరుగుతాయి. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంది. ఆర్థిక మాంద్యం గురించి ఆందోళనలు ఉన్నా సరే, ప్రపంచమంతా మాంద్యం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వాతావరణ మార్పులు ప్రపంచ ఆర్థికానికి ముప్పుగా ఉండొచ్చని, అందుకు పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. 

Tags:    

Similar News