ఇకపై హ్యూండాయ్ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశంలోని తన అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా అందించనున్నట్టు ప్రకటించింది.

Update: 2023-10-03 11:53 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశంలోని తన అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా అందించనున్నట్టు ప్రకటించింది. దేశీయ వాహన పరిశ్రమ కోసం ఇటీవల ప్రవేశపెట్టిన భారత్ ఎన్‌క్యాప్‌ పరీక్షను స్వచ్ఛందంగా పాల్గొంటామని, మొదట మూడు మోడల్ కార్లను, ఆ తర్వాత మిగిలిన వాటిని రేటింగ్ కోసం పరీక్షించనున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. కార్ల నాణ్యతను ధృవీకరించే భారత్ ఎన్‌క్యాప్ కార్యక్రమంలో పాల్గొనే అంశాన్ని కార్ల తయారీ కంపెనీలు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చని కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షల్లో కారు పనితీరును బట్టి పెద్దలు, పిల్లల భద్రతను 0-5 స్కేల్‌లో స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. కంపెనీలు తమ కార్లకు 5 స్టార్ రేటింగ్ పొందాలంటే కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కాబట్టి అందరికీ భద్రతను అందించడం కంపెనీ లక్ష్యంగా ఉంది. అందుకోసం కార్ల భద్రతా ఫీచర్లను మెరుగుపరుస్తూ, అన్ని మోడల్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ అన్షూ కిమ్ చెప్పారు. దేశంలో పెరుగుతున్న రోడ్ నెట్‌వర్క్, స్పీడ్ లిమిట్ పెరగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అప్‌గ్రేడ్ ముఖ్యమని భావించినట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ చెప్పారు.


Similar News