ఏడాది చివరి నాటికి 70 శాతం ఉద్యోగులు ఆఫీసులకు: హెచ్‌సీఎల్ టెక్!

హైబ్రిడ్ పని విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తూ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొనసాగించనున్నట్టు దేశీయ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ వెల్లడించింది.

Update: 2023-07-16 16:15 GMT

న్యూఢిల్లీ: హైబ్రిడ్ పని విధానాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తూ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొనసాగించనున్నట్టు దేశీయ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సిబ్బందిలో దాదాపు 70 శాతం మంది ఆఫీసులకు తిరిగి వస్తారని ఆశిస్తున్నట్టు కంపెనీ సీఈఓ సి విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కంపెనీ కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితుల నుంచి చాలావరకు పరిశ్రమ సాధారణ స్థితికి చేరుకోవడంతో టెక్ కంపెనీలు ఉద్యోగులను కనీసం వారంలో కొన్ని రోజులు ఆఫీసులకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఉద్యోగుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాము హైబ్రిడ్-ఫస్ట్ వర్చువల్ ఆపరేటింగ్ మోడల్‌ను కొనసాగిస్తున్నాం. ఈ విధానం అవసరాన్ని బట్టి ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం దాదాపు సగం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నారు. ఈ సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. క్లయింట్ల నుంచి కూడా తమ ప్రాజెక్టుల విషయంలో ఉద్యోగులు ఆఫీసుల నుంచే పని చేయాలని కోరుతున్నారు. కాబట్టి ఆఫీసులకు వచ్చే ఉద్యోగులు క్రమంగా పెరిగి ఏడాది చివరి నాటికి 70-75 శాతం చేరుకోవాలని ఆశిస్తున్నట్టు విజయకుమార్ పేర్కొన్నారు. చాలామంది ఉద్యోగులు చిన్న పట్టణాల్లో ఉంటున్నారు. కాబట్టి తిరిగి ఆఫీసులకు వచ్చే ప్రక్రియ నెమ్మదిగా పెరుగుతుంది.


Similar News