HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సెబీ బిగ్ షాక్.. వారంలో రెండోసారి వార్నింగ్.!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(HDFC Bank)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఈ నెల 12న వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(HDFC Bank)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఈ నెల 12న వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మర్చంట్ బ్యాంకర్లకు మూలధన నిధుల వివరాలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిషేదం వంటి నిబంధనల్ని బ్యాంక్ పాటించలేదని సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వారంలో రెండోసారి సెబీ నుంచి వార్నింగ్ అందుకుంది. సెబీ నిబంధనలను హెచ్‌డీఎఫ్‌సీ పాటించట్లేదని, మోర్ట్‌గేజ్ బిజినెస్ గ్రూప్ హెడ్ అరవింద్ కపిల్(Aravind Kapil) రాజీనామాను బ్యాంక్ మూడు రోజులు ఆలస్యంగా వెల్లడించిందంటూ హెచ్చరించింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. సెబీ వార్నింగ్ గురించి స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వివరాల్ని వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అరవింద్ కపిల్ స్థానంలో తమ మోర్ట్‌గేజ్ బిజినెస్ గ్రూప్ కొత్త హెడ్‌గా సుమంత్ రాంపాల్(Sumanth Rampal)ను 2024, మార్చి 28న నియమించింది. కానీ బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజీలకు 3 రోజులు ఆలస్యంగా అంటే మార్చి 30న తెలియజేసింది. కాగా కపిల్ ముందే రాజీనామా చేసిన బ్యాంక్ వెల్లడించలేదు. అయితే సెబీ రూల్స్ ప్రకారం లిస్టెడ్ కంపెనీలు ఇలాంటి మార్పుల గురించి ఎక్స్చేంజీలకు కచ్చితంగా 12 గంటల్లోనే సమాచారం ఇవ్వాలి. కానీ కపిల్ రాజీనామా గురించి హెచ్‌డీఎఫ్‌సీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బ్యాంక్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్ (LODR) నిబంధనల్లోని రెగ్యులేషన్ 30(6)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది.