GST: సిగరెట్లు, పొగాకు, కూల్‌డ్రింక్స్‌పై 35 శాతానికి జీఎస్టీ పెంపు
దుస్తులపై పన్ను రేట్లను హేతుబద్దీకరించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు
దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై సోమవారం జరిగిన మంత్రుల బృందం(జీఓఎం) కూల్‌డ్రింక్స్, సిగరెట్లు, పొగాకు, ఇతర అనుబంధ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 35 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అలాగే దుస్తులపై పన్ను రేట్లను హేతుబద్దీకరించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. తాజా నిర్ణయం ప్రకారం.. రూ. 1,500 వరకు ఉండే రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ. 1,500 నుంచి రూ. 10,000 మధ్య ఉండే వాటిపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. రూ. 10 వేల కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై 28 శాతం పన్ను ఉంటుంది. మొత్తంగా 148 రకాల వస్తువులపై పన్ను రేట్లను సర్దుబాటు చేయాలని జీఓఎం జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాలని నిర్ణయించింది. దీనివల్ల జీఎస్టీ రాబడిపై సానుకూల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనలపై డిసెంబర్ 21న కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం జీఎస్టీ రేట్ల మార్పులపై కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఈసారి పొగాకు సహా ఇతర ఉత్పత్తులపై పన్నును ప్రత్యేకంగా 35 శాతం పరిధిలో ఉంచాలని జీఓఎం ప్రతిపాదించింది. ప్రస్తుతానికి 5,12,18, 28 శాతం వంటి నాలుగు శ్లాబ్‌లు ఉండగా, కొత్తగా 35 శాతం శ్లాబ్‌ను ప్రతిపాదించిందని ఓ అధికారి తెలిపారు.