HALలో 3.5 శాతం వాటా విక్రయానికి కేంద్రం ప్రతిపాదన!

దేశీయ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌(హెచ్ఏఎల్‌)లో 3.5 శాతం వాటా విక్రయానికి కేంద్రం ప్రతిపాదించింది.

Update: 2023-03-22 15:25 GMT

న్యూఢిల్లీ: దేశీయ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌(హెచ్ఏఎల్‌)లో 3.5 శాతం వాటా విక్రయానికి కేంద్రం ప్రతిపాదించింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయం చేపట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఒక్కో షేర్ ధరను రూ. 2,450గా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ షేర్ ధరతో పోలిస్తే ఇది 6.6 శాతం తగ్గింపు కావడం గమనార్హం. నిర్ణయించిన షేర్ ధరతో లెక్కిస్తే దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా.

మార్చి 23న సంస్థ రూ. 10 ముఖ విలువతో 1.75 శాతం ఈక్విటీ షేర్లను(నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రమే), మార్చి 24న రిటైల్ ఇన్వెస్టర్లకు మరో 1.75 శాతం విక్రయించేలా ప్రణాళిక కలిగి ఉన్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రభుత్వం వివరించింది.

కాగా, 2020లో కేంద్రం హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌లో 15 శాతం వాటాను విక్రయించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 50 వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందులో రూ. 31,110 కోట్లను సేకరించింది.

Tags:    

Similar News