గుడ్ బై కూ..!.. మూతపడ్డ దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్

ప్రముఖ దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ.. మూతపడింది.

Update: 2024-07-03 11:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ.. మూతపడింది. ఈ మేరకు కూ యాప్ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ లింక్డ్ ఇన్ లో పోస్ట్ పెట్టారు. 2019 లో అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిడవట్కా వ్యవస్థాపకులుగా ఈ దేశీయ యాప్ ను ప్రారంభించారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విట్టర్ తో కేంద్ర ప్రభుత్వానికి నెలకొన్న వివాదం కారణంగా ఈ యాప్ వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర మంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్ గా కూని ప్రమోట్ చేశారు. దీంతో యూసర్ బేస్ భారీగా పెరగడంతో.. అనతి కాలంలోనే ఈ యాప్ ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అందరూ ఊహించారు. అనంతరం యాప్ సేవలను నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం విస్తరించారు.

తర్వాత సంస్థకు భారీగా ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టుడంతో.. ఈ ఏడాది లేఆఫ్ లు కూడా ప్రకటించింది. దీంతో ఈ యాప్ ను విక్రయించాలని సంస్థ యజమానులు నిర్ణయించుకున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలతో కూ విక్రయానికి చర్చలు జరిపినప్పటికీ అవేమి సఫలం కాలేదని, దీంతో యాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ సీఈవో తెలిపారు. లింక్డ్ ఇన్ లో పెట్టిన పోస్ట్ ప్రకారం.. స్థానిక బాషలకు పెద్ద పీట వేస్తూ.. దేశీయ సోషల్ మీడియా యాప్ ను రూపొందించామని, ఓ దశలో కూ ఉపయోగించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 లక్షలకు చేరుకుందని తెలిపారు. ఆర్ధిక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దేశీయ యాప్ ను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఈ నాలుగేళ్ల ప్రయణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని, లిటిల్ ఎల్లో బర్డ్ ఇక గుడ్ బై చెబుతోందని వ్యవస్థాపకులు రాసుకొచ్చారు.

Tags:    

Similar News