Gold Demand: ఆగస్టులో రెట్టింపు పెరిగిన బంగారం దిగుమతులు

గతేడాది ఆగష్టులో దిగుమతి అయిన 4.83 బిలియన్ డాలర్ల(రూ. 40 వేల కోట్ల) కంటే ఇది రెట్టింపు.

Update: 2024-09-17 18:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కస్టమ్స్ డ్యూటీలో భారీగా కోత విధించడం, పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో ఆగష్టులో బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. మంగళవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో 10.06 బిలియన్ డాలర్ల(రూ. 84.29 వేల కోట్ల) విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. గతేడాది ఆగష్టులో దిగుమతి అయిన 4.83 బిలియన్ డాలర్ల(రూ. 40 వేల కోట్ల) కంటే ఇది రెట్టింపు. బంగారం దిగుమతులపై మాట్లాడిన వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్.. బంగారంపై సుంకం రేట్లను భారీగా తగ్గించామని, దానివల్ల స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలు తగ్గుతాయని చెప్పారు. బడ్జెట్‌లో సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలవడంతో ఆభరణాల వ్యాపారులు నిల్వ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఏప్రిల్-జూలై మధ్యకాలంలో దేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రభావం చూపే భారత బంగారం దిగుమతులు 4.23 శాతం తగ్గి 12.64 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో చైనా ఉంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచే వస్తుంది. 

Tags:    

Similar News