Gold Price: కొత్త రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం ధరలు
ఆభరణాల తయారీతో పాటు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడం వల్ల వెండికి సైతం గిరాకీ ఎక్కువగా కనిపిస్తోంది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు కొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు విపరీతంగా పెరగడంతో డిమాండ్ పుంజుకుంది. ఈ క్రమంలోనే బుధవారం దేశ రాజధానిలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 78,900 వద్ద కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఆభరణాల తయారీతో పాటు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడం వల్ల వెండికి సైతం గిరాకీ ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా పెరిగి రూ. 93,500కి పెరిగింది. వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువ కావడమే కాకుండా గత కొన్ని సెషన్‌లలో భారత ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం కూడా సురక్షితమైన బంగారంలో పెట్టుబడులకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 500 పెరిగి రూ. 77,890 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 450 పెరిగి రూ. 71,400 వద్ద ఉంది.