LIC: రూ.10 వేల కోట్లకు పైగా లాభాలతో దుమ్ము రేపిన LIC

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)తాజాగా ప్రకటించిన తన ఆర్థిక ఫలితాల్లో జోరు చూపించింది

Update: 2024-08-09 08:29 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)తాజాగా ప్రకటించిన తన ఆర్థిక ఫలితాల్లో జోరు చూపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో సంస్థ రూ.10,461 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది(2023-24) ఇదే కాలంలో సాధించిన రూ.9,544 కోట్లతో పోలిస్తే ఈ సారి 9.61 శాతం అధికం కావడం గమనార్హం. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 30, 2024తో ముగిసే నాటికి సంస్థ మొత్తం ఆదాయం రూ. 2,10,910 కోట్లకు పెరిగింది, గత ఏడాది ఇది రూ. 1,88,749 కోట్లుగా నమోదైంది.

ఏప్రిల్-జూన్ కాలంలో ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.6,811 కోట్ల నుంచి రూ.7,470 కోట్లకు చేరుకుంది. అలాగే రెన్యువల్ ప్రీమియంల ద్వారా వచ్చిన ఆదాయం 55,300 కోట్లకు పెరిగింది. ఇది గత ఏడాది రూ. 52,311 కోట్లుగా ఉంది. ఈ మూడు నెలల కాలంలో పెట్టుబడుల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ. 96,183 కోట్లకు పెరిగింది, గత ఏడాది ఇది రూ. 90,309 కోట్లు. జూన్ త్రైమాసికంలో బీమా సంస్థ నికర లాభం వృద్ధికి అధిక మార్జిన్ నాన్-పార్టిసిపేటింగ్ పాలసీల అమ్మకాలు పెరగడం చాలా వరకు ఉపయోగపడింది. ఈ కాలంలో సంస్థ వ్యక్తిగత విభాగంలో మొత్తం 35,65,519 పాలసీలను విక్రయించింది, అదే జూన్ 30, 2023తో ముగిసిన కాలంలో 32,16,301 పాలసీల అమ్మకాలు నమోదు చేయగా, ప్రస్తుతం 10.86 శాతం వృద్ధిని సాధించింది.

త్రైమాసికంలో ఎల్‌ఐసీ స్థూల నిరర్థక ఆస్తుల నాణ్యత(జీఎన్‌పీఏ) గత ఏడాది 2.48 శాతంతో పోలిస్తే 1.95 శాతంగా ఉంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ, బీమా సంస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.86 శాతం ఎక్కువ పాలసీలను విక్రయించింది. మా మార్కెట్ వాటా మునుపటి సంవత్సరం ఇదే త్రైమాసికంలో 61.42 శాతంతో పోలిస్తే 64.02 శాతానికి పెరిగింది. వినియోగదారుల ప్రయోజనాల కోసం మరిన్ని పాలసీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

Tags:    

Similar News