ఈ ఏడాది ఈక్విటీల్లో రూ. లక్షల కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు!

దేశ ఆర్థిక వృద్ధి, మెరుగైన కంపెనీల ఆదాయాల కారణంగా విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు.

Update: 2023-07-16 16:09 GMT

ముంబై: దేశ ఆర్థిక వృద్ధి, మెరుగైన కంపెనీల ఆదాయాల కారణంగా విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 30,600 కొట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇదే ధోరణి కొనసాగితే జూలై నెలలో ఎఫ్‌పీఐలు జూన్‌లో నమోదైన రూ. 47,148 కోట్లను అధిగమించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం కొనసాగుతుండటంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 1.07 లక్షల కోట్లకు చేరుకుందని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి.

అయితే, పెరుగుతున్న వాల్యూయేషన్‌లు కొంత ఆందోళనలు కలిగిస్తున్నాయి. భారత్‌తో పోలిస్తే చైనాలో మార్కెట్ వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి విదేశీ మదుపర్ల సానుకూల ధోరణి ఎంతకాలమనేది చెప్పలేమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు మార్చి నుంచి కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లో సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,076 కోట్ల నిధులు పెట్టారు. ముఖ్యంగా ఫైనాన్స్, ఆటో, కేపిటల్ గూడ్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు.


Similar News