FPIs: కొనసాగుతున్న ఎఫ్‌పీఐల ఉపసంహరణ..నవంబర్‌లో రూ. 22 వేల కోట్లు వెనక్కి
అమ్మకాలు కొనసాగినప్పటికీ అంతకుముందు అక్టోబర్‌లో ఉపసంహరించుకున్న రూ. 94,017 కోట్లతో పోలిస్తే గత నెలలో గణనీయంగా తగ్గాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా బాడ్ రాబడులు పెరగడం, డాలర్ విలువ బలపడటం మన దేశ ఆర్థికవ్యవస్థ నెమ్మదించిన కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అమ్మకాలను కొనసాగించారు. నవంబర్‌లోనూ భారత్ ఈక్విటీల నుంచి రూ. 21,612 కోట్ల విలువైన నిధులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. అమ్మకాలు కొనసాగినప్పటికీ అంతకుముందు అక్టోబర్‌లో ఉపసంహరించుకున్న రూ. 94,017 కోట్లతో పోలిస్తే గత నెలలో గణనీయంగా తగ్గాయి. రానున్న వారాల్లో ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ప్రస్తుత ద్రవ్యోల్బణ, వడ్డీ రేటు అంశాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావితం చేయనున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. రానున్న రోజుల్లో దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక వృద్ధి కారణంగా ఇవెస్టర్ల సెంటిమెంట్‌ను ఎక్కువ ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.