భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 5,600 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!
ప్రస్తుత నెలలో ఇప్పటివరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) రూ. 5,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి.
ముంబై: ప్రస్తుత నెలలో ఇప్పటివరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) రూ. 5,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండటం, దేశీయంగా పండుగ సీజన్ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం పెరుగుతుందనే అంచనాల మధ్య విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లను కొనసాగించారు. ఆగష్టులో విదేశీ పెట్టుబడిదారులు రూ. 51,200 కోట్ల నిధులను భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. అంతకుముందు జూలైలో రూ. 5,000 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేశారని డిపాజిటరీ గణాంకాలు పేర్కొన్నాయి.
గతేడాది అక్టోబర్ నుంచి వరుసగా తొమ్మిది నెలల పాటు విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలను కొనసాగించిన తర్వాత జూలై నుంచి తిరిగి భారత మార్కెట్లలో పెట్టుబడులు పెంచారు. 2021 అక్టోబర్ నుంచి 2022 జూన్ మధ్య కాలంలో ఎఫ్ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి అత్యధికంగా రూ. 2.46 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రానున్న రోజుల్లోనూ ఎఫ్ఐఐల ధోరణి ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా బాండ్ ఈల్డ్‌తో పాటు డాలర్ విలువ 110 డాలర్లను దాటితే విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వి కె విజయకుమార్ అన్నారు.