100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో అంబానీ
200 మంది భారతీయుల సంపద 41 శాతం పెరిగి రూ. 79.60 లక్షల కోట్లకు చేరుకుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచ బిలీయనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 200 మంది భారతీయులు ఉన్నారు. గతేడాది 169 మంది ఉండేవారు. వీరందరి సంపద 675 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 56.30 లక్షల కోట్ల) నుంచి ఏకంగా 41 శాతం పెరిగి 954 బిలియన్ డాలర్ల(రూ. 79.60 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద రూ. 6.92 లక్షల కోట్ల నుంచి 39.8 శాతం పెరిగి రూ. 9.68 లక్షల కోట్ల(116 బిలియన్ డాలర్ల)కు పెరగడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దీంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. అలాగే, ప్రపంచంలోనే తొమ్మిదవ సంపన్న వ్యక్తిగా, ఆసియా అత్యంత ధనికుడిగా కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు.
ఆయన తర్వాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్ల(రూ. 7 లక్షల కోట్ల)తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక, భారత అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ రూ. 2.80 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అలాగే, నాలుగో అత్యంత సంపన్న భారతీయురాలిగా కూడా నిలిచారు. గతేడాది ఆమె ఆరో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2024 జాబితాలో తొలిసారిగా 25 మంది భారతీయులు అడుగుపెట్టారు. వీరిలో మెదాంత ఎండీ నరేష్ ట్రెహన్, కేన్స్ టెక్నాలజీ ఎండీ రమేష్ కున్హికన్నన్, ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓ రేణుకా జగ్తియాని ఉన్నారు. ఈ సారి జాబితా నుంచి బైజూ రవీంద్రన్, రోహికా మిస్త్రీ స్థానాలను కోల్పోయారు.
టాప్-10 భారతీయుల జాబితా..
ముఖేష్ అంబానీ రూ. 9.68 లక్షల కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ(రూ. 7 లక్షల కోట్లు), శివ నాడార్( రూ. 3.07 లక్షల కోట్లు), సావిత్రి జిందాల్(రూ. 2.80 లక్షల కోట్లు), దిలీప్ షాంఘ్వి( 2.27 లక్షల కోట్లు), సైరస్ పూనావల్ల( 1.77 లక్షల కోట్లు), కుశాల్ పాల్ సింగ్( రూ. 1.74 లక్షల కోట్లు), కుమార్ బిర్లా( రూ. 1.64 లక్షల కోట్లు), రాధాకిషన్ దమానీ( రూ. 1.46 లక్షల కోట్లు), లక్ష్మీ మిట్టల్(రూ. 1.36 లక్షల కోట్ల)తో జాబితాలో ఉన్నారు.
ఇక, ప్రపంచ బిలీయనీర్ల జాబితాలో 233 బిలియన్ డాలర్లతో బెర్నర్డ్ ఆర్నాల్ట్ కుటుంబం అగ్రస్థానంలో ఉండగా, ఎలాన్ మస్క్(195 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(194 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్(177 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్(141 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్(133 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్(128 బిలియన్ డాలర్లు), స్టీవ్ బామర్(121 బిలియన్ డాలర్లు), ముఖేష్ అంబానీ(116 బిలియన్ డాలర్లు), లారీ పేజ్(114 బిలియన్ డాలర్లు)తో మొదటి పది స్థానాల్లో ఉన్నారు.