భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలను ఆహ్వానించిన నిర్మలా సీతారామన్!

ప్రపంచ స్థాయి కంపెనీలు భారత అభివృద్ధిలో భాగం కావడానికి అవకాశాలను కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

Update: 2023-04-11 10:45 GMT

వాషింగ్టన్: ప్రపంచ స్థాయి కంపెనీలు భారత అభివృద్ధిలో భాగం కావడానికి అవకాశాలను కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. న్యాయబద్ధ, పారదర్శక ఆర్థికవ్యవస్థగా భారత్ ఉందని, అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు.

ప్రస్తుతం దేశాభివృద్ధిలో ప్రపంచ స్థాయి కంపెనీలకు అవకాశాలు అందిస్తోందని, కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం తీసుకున్న విధాన, సంస్కరణలే దీనికి కారణమని ఆమె తెలిపారు. డిజిటలైజేషన్‌లో భాగంగా డిజిటల్ చెల్లింపులు, అసంఘటిత రంగాన్ని పటిష్టం చేయడంలో చేపట్టిన కీలక చర్యలతో భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఇదే సమావేశంలో అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. జీ20 అధ్యక్ష హోదాలో భారత్ వివిధ రంగాల వారితో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. దేశీయంగా ఉన్న కంపెనీలతోనే కాకుండా ఇతర దేశాల్లోని వారితో కూడా కలిసి పని చేస్తున్నామన్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాపార సరళీకరణలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని, దానివల్ల భారత పెట్టుబడుల వాతావరణం మరింత మెరుగ్గా ఉంటుందని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కశ్యప్ పేర్కొన్నారు.

Tags:    

Similar News