GIC Re: జీఐసీ రీలో 6.78 శాతం వాటా విక్రయించనున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ

దీని ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 4,700 కోట్ల వరకు ఆర్జించాలని లక్ష్యంగా ఉంది.

Update: 2024-09-03 15:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ రీఇన్స్యూరెన్స్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC) Reలో 6.78 శాతం వాటాను విక్రయించనుంది. దీని ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 4,700 కోట్ల వరకు ఆర్జించాలని లక్ష్యంగా ఉంది. 2017లో జీఐసీ సంస్థ లిస్ట్ అయిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం వాటాను విక్రయిస్తోంది. GICలో వాటా విక్రయం కోసం బుధవారం రిటైల్ పెట్టుబడిదారులకు ఆఫర్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం 3.39 శాతం ఈక్విటీతో పాటు 3.39 శాతం గ్రీన్ షూ ఆప్షన్‌గా వాటాను తగ్గించుకుంటోందని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం(DIPAM) సెక్రటరీ ఎక్స్‌లో ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో వాటా విక్రయానికి ఒక్కో షేర్ ధరను రూ. 395గా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే 6 శాతం తక్కువ. మంగళవారం ట్రేడింగ్‌లో జీఐసీ రీ షేర్ ధర రూ. 420.8 వద్ద ముగిసింది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వానికి జీఐసీ రీలో 85.78 శాతం వాటా ఉంది. వాటా విక్రయంపై సంస్థ ఛైర్మన్, ఎండీ రామస్వామి నారాయణన్ ఈ ఏడాది ప్రారంభంలోనే సంకేతమిచ్చారు. ఎన్నికల తర్వాత సంస్థ 10 శాతం వరకు వాటాను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏప్రిల్ నాటి ప్రకటనలో చెప్పారు.  

Tags:    

Similar News