Windfall Tax: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుపై ప్రభుత్వం కసరత్తు

ఇటీవల అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. కాబట్టి ఇకపై ఈ పన్ను అవసరం ఉండకపోవచ్చని తరుణ్ కపూర్ అభిప్రాయపడ్డారు.

Update: 2024-10-23 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ అంశం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని ప్రధానమంత్రి సలహాదారు తరుణ్ కపూర్ బుధవారం తెలిపారు. అధిక ధరలు ఉన్న కారణంగా 2022లో ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటీవల అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. కాబట్టి ఇకపై ఈ పన్ను అవసరం ఉండకపోవచ్చని తరుణ్ కపూర్ అభిప్రాయపడ్డారు. పెట్రోలియం శాఖ దీని గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. కాబట్టి విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ పన్నును తీసుకొచ్చిన సమయంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన(ఏటీఎఫ్) ఎగుమతులకు ప్రతి రెండు వారాలకు ఒకసారి సవరించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దానివల్ల దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు కంపెనీలు పొందే అనూహ్య లాభాలపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పన్నును ప్రభుత్వం విధిస్తూ వచ్చింది. ఇటీవల అంతర్జాతీయంగా ధరలు దిగిరావడంతో ఈ పన్ను రద్దు అవసరంలేదని చర్చ ముందుకొచ్చింది. 

Tags:    

Similar News