సెప్టెంబర్‌లో రికార్డు స్థాయి ప్యాసింజర్ వాహన అమ్మకాలు!

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది.

Update: 2023-10-01 14:19 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. దాంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి వాహన పరిశ్రమలో అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు సైతం డీలర్లకు స్టాక్‌లను పెంచాయి. ఈ క్రమంలో గత నెల ప్యాసింజర్ వాహనాల విభాగంలో 3,63,733 యూనిట్ల హోల్‌సేల్ విక్రయాలు నమోదయ్యాయి.

ఇది ఇప్పటివరకు అత్యుత్తం అమ్మకాల నెల కావడం విశేషం. ఇప్పటివరకు ఈ ఏడాది ఆగష్టులో నమోదైన 3,60,700 యూనిట్ల సరఫరాయే ఇప్పటివరకు అత్యుత్తమం. దేశ ప్యాసింజర్ వాహన చరిత్రలో ఇవే మెరుగైన హోల్‌సేల్ అమ్మకాలని మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.

అక్టోబర్ 14 నుంచి మొదలయ్యే పూర్తిస్థాయి పండుగ సీజన్ కోసం డీలర్లు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. ఇక, మారుతీ సుజుకి సమీక్షించిన నెలలో ఒక అర్ధ వార్షికంలో తొలిసారిగా 10 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ 10,50,085 యూనిట్లతో మెరుగైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌లో 3 శాతం పెరుగుదలతో 1,81,343 యూనిట్లను డీలర్లకు పంపింది. అలాగే, హ్యూండాయ్, టయోటా సైతం అత్యుత్తమ నెలవారీ హోల్‌సేల్ అమ్మకాలను సాధించాయి. మిగిలిన కంపెనీలు కూడా మెరుగైన అమ్మకాలను వెల్లడించాయి.


Similar News