DELL layoffs: ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన డెల్.. 12,500 మంది ఔట్

ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీలు వరుసగా తమ ఉద్యోగులకు షాక్‌లు ఇస్తున్నాయి. గ్లోబల్ ఆర్థిక మాంద్యం, ఆ

Update: 2024-08-07 12:29 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీలు వరుసగా తమ ఉద్యోగులకు షాక్‌లు ఇస్తున్నాయి. గ్లోబల్ ఆర్థిక మాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా, తాజాగా ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ (Dell) తన వర్క్ ఫోర్స్‌ను తగ్గించడానికి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మొత్తం ఉద్యోగుల సంఖ్య కంపెనీ శ్రామిక శక్తిలో 10 శాతంతో సమానం. ఈ లేఆఫ్‌పై కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌‌పై ఎక్కువగా దృష్టి సారించడంతో, వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి సేల్స్ విభాగంలో ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది.

ఉద్యోగం కోల్పోయిన వారికి ఈ విషయాన్ని ఆగస్టు 6న అంతర్గత మెమోలో తెలియజేశామని కంపెనీ పేర్కొంది. తొలగింపులు ప్రధానంగా మేనేజర్‌లు, సీనియర్ మేనేజర్‌లపై ప్రభావం చూపాయి. ఉద్యోగం కోల్పోయిన వారిలో కొంతమంది రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నవారు ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి నాటికి డెల్‌లో మొత్తం 1,30,000 మంది ఉద్యోగులు ఉండగా, ఈ సంఖ్య ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నాటికి 1,20,000 వరకు తగ్గింది. ఇదిలా ఉంటే ఖర్చు తగ్గింపులో భాగంగా చాలా టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవల ఇంటెల్‌ సంస్థ 15వేల మందిని తొలగించింది. ఈ నేపథ్యంలో ఇలా వరుసగా లేఆఫ్‌ ప్రకటనలు వస్తుండటంతో ఇతర సంస్థల ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News