Infosys: భారత్ తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పడం సాహసమే: ఇన్ఫో నారాయణమూర్తి
ఈ రంగంలో మనదేశం ఏదైనా గణనీయమైన పురోగతి సాధించాలనే ప్రభుత్వం ప్రమేయం, ప్రభుత్వ పాలనలో మెరుగుదల ఎంతో కీలకం
దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గత కొన్నేళ్ల నుంచి చైనాను అధిగమించి భారత్ తయారీ హబ్‌గా మారుతుందనే ప్రచారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా 'ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మిట్-2024' కార్యక్రమంలో మాట్లాడిన మూర్తి.. మన దేశానికి పక్కనే చైనాను చూస్తూ ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలని భారత్ ఆకాంక్షించడం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. చైనా తయారీ నైపుణ్యంతో పోటీ పడగల భారత సామర్థ్యంపై సందేహం ఉంది. ఈ రంగంలో మనదేశం ఏదైనా గణనీయమైన పురోగతి సాధించాలనే ప్రభుత్వం ప్రమేయం, ప్రభుత్వ పాలనలో మెరుగుదల ఎంతో కీలకం. 'హబ్, గ్లోబల్ లీడర్ ' లాంటి పెద్ద పెద్ద పదాలను ఉపయోగించడం కూడా అతిశయోక్తిగానే తోస్తోంది. చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ స్టోర్‌లలో దాదాపు 90 శాతం వస్తువులు చైనాలోనే తయారవుతున్నాయి. అవి భారత జీడీపీకి ఆరు రెట్లు ఉంటాయి. భారత్ తయారీ కేంద్రం అవుతుందని చెప్పడం సాహసమనే అనుకోవాలి. చైనా తయారీ సామర్థ్యాలకు పోటీగా నిలిచేందుకు భారత్‌కు అవసరమైన దానికి అంతరం ఎక్కువగా ఉందని గుర్తించాలి. ఐటీ రంగం ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తుండగా, తయారీ పరిశ్రమ దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతుపై ఎక్కువగా ఆధారపడి కొనసాగుతోందని' నారాయణ మూర్తి ప్రసంగించారు. తయారీలో లక్ష్యాలు చేరుకోవాలంటే ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకం. దురదృష్టవశాత్తు.. దేశంలో ఇప్పటికీ స్పందన, పారదర్శకత, జవాబుదారీతనం, వేగం సహా పలు అంశాల్లో మెరుగైన పనితీరు అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్పాదక వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారలోపాన్ని తగ్గించడం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు.