LTCG: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును సడలించనున్న కేంద్రం
ఏది తక్కువైతే దానిపై పన్ను చెల్లించేలా మార్పులు చేయనున్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ప్రధాని మోడీ ప్రభుత్వం ఆస్తుల విక్రయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో దీన్ని తగ్గించే ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాయిటర్స్ కథనం పేర్కొంది. దీని ప్రకారం, 2024, జూలై 23లోపు కొన్న ఆస్తి, భూమి, భవనం లేదా రెండింటినీ కొన్నవారు లాంగ్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్(ఎల్‌టీసీజీ)ని కొత్త(12.5 శాతం ఇండెక్సేషన్ లేకుండా) లేదంటే పాత(20 శాతం ఇండెక్సేషన్‌తో కలిపి) పద్దతిలో లెక్కించి, ఏది తక్కువైతే దానిపై పన్ను చెల్లించేలా మార్పులు చేయనున్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును పెంచుతూ ప్రకటన చేశారు. ఆస్తి విక్రయం కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును 15 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఎల్‌టీసీజీని 12.5 శాతానికి చేర్చారు.