ప్రభుత్వ ఉద్యోగులకు 25 ఏళ్ల సర్వీసుతో 50%.. 10 ఏళ్ల సర్వీసుతో రూ.10 వేల పెన్షన్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ "నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)" స్థానంలో కొత్తగా "ఏకీకృత పెన్షన్ స్కీమ్(యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)"ను తీసుకొచ్చింది
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ "నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)" స్థానంలో కొత్తగా "ఏకీకృత పెన్షన్ స్కీమ్(యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)"ను తీసుకొచ్చింది. శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద 25 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ వర్తిస్తుంది. పదవీ విరమణకు ముందు 12 నెలల్లో తీసుకున్న సగటు కనీస వేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్ కింద అందిస్తారు. కనీసం పదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి నెలకు రూ.10,000 పెన్షన్ వస్తుంది, ఒకవేళ సర్వీసు సమయంలో ఉద్యోగి మరణిస్తే వారి భార్యకు 60 శాతం పెన్షన్ ఇస్తారు. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025 నుంచి అమలవుతుంది. ఉద్యోగులకు ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్‌లో దేనినైనా ఎంచుకునే ఆప్షన్ ఉంది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో ఉన్న వారికి కూడా యూపీఎస్‌కు మారేందుకు అవకాశం కల్పించారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, పాత పెన్షన్ పథకం పైనే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు తీసుకొచ్చిన యూపీఎస్‌తో దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని, దీని కోసం రూ.10,579 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఏయే పథకాలు ఉన్నాయో పరిశీలించి, ప్రజలందరితో చర్చించి ఏకీకృత పెన్షన్ విధానాన్ని టివి సోమనాథన్ ఆధ్వర్యంలో కమిటీ సూచించిందని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో ఉద్యోగులు పెన్షన్‌పై చేస్తున్న డిమాండ్‌ను అనుసరించి కేంద్రం పెన్షన్ స్కీమ్‌ను సమీక్షించడానికి, ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులను సూచించడానికి ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీ సూచనల మేరకు కేంద్రం ఏకీకృత పెన్షన్ స్కీమ్( యూపీఎస్)కు ఆమోదం తెలిపింది.