CCI: యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

2020లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భాగస్వామ్యం ఉన్న వ్యాపారులకు ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో సీసీఐ విచారణకు ఆదేశించింది.

Update: 2024-09-12 19:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ తమ షాపింగ్ వెబ్‌సైట్‌లలో ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించాయని భారత యాంటీట్రస్ట్ దర్యాప్తులో తేలింది. 2020లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమతో భాగస్వామ్యం ఉన్న వ్యాపారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతోకాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. అమెజాన్‌కు సంబంధించి 1027 పేజీలు, ఫ్లిప్‌కార్ట్‌పై 1,696 పేజీల నివేదిక ప్రకారం, రెండు కంపెనీలు సెర్చింగ్‌లో ఉద్దేశపూర్వకంగానే వారికి నచ్చిన విక్రేతలు కనిపించే విధంగా ఏర్పాటు చేశాయని తేలింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో నిజమని తేలాయని నివేదిక స్పష్టం చేసినట్టు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించి సీసీఐ అధికారికంగా నివేదికను బహిర్గతం చేయాల్సి ఉంది. రాయిటర్స్ దీనిపై స్పందించాలని కోరగా, సీసీఐ స్పందించలేదు. ఇక, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఆరోపణలపై గతంలోనే ఖండించాయి. తాము భారతీయ చట్టాల పాటిస్తున్నామని ప్రకటించాయి. 

Tags:    

Similar News