వరుసగా రెండో నెలా జీతాలు ఆలస్యం చేసిన బైజూస్
ఏప్రిల్ 8 నాటికి జీతాలు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బైజూస్ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.
దిశ, బిజినెస్ బ్యూరో: రైట్స్ ఇష్యూ విషయంలో ఇన్వెస్టర్లతో సమస్యలు కొనసాగుతుండటంతో ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ వరుసగా రెండో నెల మార్చిలోనూ ఉద్యోగులకు జీతాలను ఆలస్యం చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 8 నాటికి జీతాలు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బైజూస్ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. ఫిబ్రవరిలో సైతం కంపెనీ ఉద్యోగులకు మార్చి మధ్య వరకు జీతాలు ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత బకాయిల్లో కొంత భాగాన్ని చెల్లించింది. ఈ క్రమంలో మార్చి జీతాలు కూడా ఆలస్యం అవనున్నట్టు తెలిపింది. పరిస్థితుల కారణంగా ఈసారి కూడా జీతాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుందని చెప్పడానికి బాధపడుతున్నామని బైజూస్ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొంది. కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి చివర్లో రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ఉపయోగించకుండా నిర్ణయం తీసుకోవడంతో, వారి బాధ్యతా రహితమైన చర్య వల్ల ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని కంపెనీ లేఖలో వివరణ ఇచ్చింది.