తొలిసారి 80 వేల పైన ముగిసిన సెన్సెక్స్

బ్యాంక్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌ల మధ్య సెన్సెక్స్ 80,000 మైలురాయికి పైన ముగిసింది.

Update: 2024-07-09 12:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిలకు చేరాయి. గత రెండు మూడు సెషన్‌లలో అమ్మకాల ఒత్తిడి, లాభాల స్వీకరణకు గురైన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో కొత్త గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తితో పాటు దేశీయ బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు ర్యాలీకి కారణమయ్యాయి. ప్రధాన బ్యాంక్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌ల మధ్య కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ తొలిసారిగా చరిత్రాత్మక 80,000 మైలురాయికి పైన ముగిసింది. నిఫ్టీ కూడా కొత్త స్థాయిలకు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 391.26 పాయింట్లు లాభపడి 80,351 వద్ద, నిఫ్టీ 112.65 పాయింట్ల లాభంతో 24,433 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ మినహా అన్ని రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, ఐటీసీ, సన్‌ఫార్మా, టైటాన్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.49 వద్ద ఉంది.


Similar News