బీజేపీ విజయంతో PSU షేర్లలో భూమ్.. అదే ఇండియా కూటమి అయితే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లయితే భారత ఈక్విటీ మార్కెట్లో వివిధ రంగాల షేర్లు భారీగా పుంజుకునే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ నోమురా ఒక నోట్‌లో పేర్కొంది
దిశ, బిజినెస్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్లయితే భారత ఈక్విటీ మార్కెట్లో వివిధ రంగాల షేర్లు భారీగా పుంజుకునే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ నోమురా ఒక నోట్‌లో పేర్కొంది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో 543 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 272 సీట్లకు పైగా మెజారిటీతో బీజేపీ విజయం సాధించడంతో పాటు ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సాధించడం వల్ల ఆర్థిక, పరిశ్రమలు/మౌలిక సదుపాయాలు, పీఎస్‌యూల్లో దేశీయ రంగ షేర్లు మెరుగైన పనితీరు కనబరుస్తాయని నోమురా తన తాజా పత్రికలో పేర్కొంది. అయితే ఐటీ, హెల్త్‌కేర్ షేర్లలో ర్యాలీ మాత్రం తక్కువగా ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి విజయం సాధించడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంది. పథకాలు, ప్రోత్సాహాకాలు తదుపరి కాలంలో కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉన్నప్పటికీ, ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే, ఈక్విటీ మార్కెట్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పీఎస్‌యూలు వంటి అత్యంత విలువైన దేశీయ రంగాలలో అమ్మకాలను చూడవచ్చని నోమురా అంచనా వేసింది.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ఒకవేళ ఈ కూటమి సగం మార్కును అధిగమించగలిగితే ఈక్విటీ మార్కెట్లో చాలా ఆర్థిక, పారిశ్రామిక, పీఎస్‌యూల షేర్లలో అమ్మకాలు కొనసాగుతాయని, అదే ఐటీ, ఫార్మాస్యూటికల్ రంగాల షేర్లు మెరుగైన పనితీరు కనబరుస్తాయని నోమురా పేర్కొంది. 2014 మే 26 న నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుండి, నిఫ్టీ 50 విలువ 7,359 నుండి 22,055కి పెరిగింది, ఇది 200 శాతం పెరుగుదలను సూచిస్తుంది. కాగా, సెన్సెక్స్ 195 శాతం లాభంతో 24,700 నుంచి 72,700కి చేరుకుంది.