ఆర్‌బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందిన భారత్‌పే, హిటాచీ!
ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ భారత్‌పే మంగళవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను పొందింది.
ముంబై: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ భారత్‌పే మంగళవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను పొందింది. రెజిలెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(భారత్‌పే)కి చెందిన 100 శాతం యాజమాన్య అనుబంధ సంస్థ రెసిలెంట్ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సూత్రప్రాయ ఆమోదం లభించిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం తాము దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ వ్యాపారులు, కిరాణా స్టోర్ యజమానులకు మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 400 కంటే ఎక్కువ నగరాల్లో కోటి మంది వ్యాపారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నామని భారత్‌పే సీఎఫ్ఓ, తాత్కాలిక సీఈఓ నలిన్ నేగి అన్నారు. తాజా ఆర్‌బీఐ అనుమతితో విస్తరణ ప్రణాళికను చేపడతామని, డిజిటల్ చెల్లింపుల పరిష్కారాలను అందించడం ద్వారా మరింత మంది వ్యాపారులకు చేరుకుంటామని ఆయన తెలిపారు. నిర్ణీత గడువులోగా మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌బీఐ నుంచి తుది అనుమతులు పొందిన తర్వాత పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తామని భారత్‌పే పేర్కొంది.
కంపెనీ ప్రస్తుతం నెలకు 18 కోట్ల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే 4.50 లక్షల మంది వ్యాపారులకు రూ. 8,500 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేసింది. కాగా, భారత్‌పేతో పాటు హిటాచీ కంపెనీకి సైతం ఆర్‌బీఐ చెల్లింపుల సేవలకు అనుమతి ఇచ్చింది. ఆర్‌బీఐ ఇచ్చిన పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ ద్వారా దేశంలో డిజిటల్ చెల్లింపులకు మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నామని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ రుస్తోమ్ ఇరానీ పేర్కొన్నారు.
READ MORE