Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు

రోజంతా లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు ఐటీ రంగ షేర్ల మద్దతుతో నష్టాలను తగ్గించగలిగాయి.

Update: 2024-10-04 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో రోజురోజుకు తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా మన మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులు వెనక్కి తీసుకోవడం, దేశీయంగా కీలక బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగాల షేర్లలో భారీ అమ్మకాలు సూచీలను దెబ్బతీశాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా రికార్డు గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా ఐదో రోజు నష్టాలు ఎదురయ్యాయి. శుక్రవారం రోజంతా లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు ఐటీ రంగ షేర్ల మద్దతుతో నష్టాలను తగ్గించగలిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 808.65 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద, నిఫ్టీ 235.50 పాయింట్ల నష్టంతో 25,014 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ మినహా మిగిలిన రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎస్‌బీఐ లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.97 వద్ద ఉంది. 

Tags:    

Similar News