మోడీ 3.0 ఎజెండాలో బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రాధాన్యత: అరవింద్ పనగారియా
ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలోకి వస్తే తమ ఎజెండాలో ఇది ఉండాలని తెలిపారు.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఉండాలని భారత 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ డా అరవింద్ పనగరియా చెప్పారు. శుక్రవారం బిజినెస్ టుడే బ్యాంకింగ్ అండ్ ఎకానమీ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలోకి వస్తే తమ ఎజెండాలో ఇది ఉండాలని తెలిపారు. 'ఎందుకంటే, ఇది ఒక మంచి అవక్శాం. ప్రభుత్వ బ్యాంకులు మెరుగైన పనితీరును కలిగి ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత విలువ పెరుగుతుంది. ప్రైవేటీకరణకు ఇదే మంచి సమయం. ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను వీలైనంత వేగంగా ప్రైవేటీకరణ చేయడానికి సరైన సమయంగా నేను భావిస్తున్నాను ' అని ఆయన వివరించారు. ఇదివరకు పీఎస్‌యూ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) స్థాయిలు భారీగా ఉండేవి. ప్రభుత్వం నిధులు సమకూర్చడం ద్వారా దీన్ని పరిష్కరించింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల విలువను తక్కువ అంచనా వేసే ధోరణి తొలగింది. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయి. మెరుగైన అకౌంట్ బుక్స్‌ను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇది ప్రైవేటీకరణకు అనువైన సమయమని పనగరియా వెల్లడించారు. ఇది సుధీర్ఘమైన ప్రక్రియ. అయితే, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులూ ప్రైవేటీకరించబడవని ఆయన పేర్కొన్నారు.