మొండి రుణాల నిర్వహణలో అత్యుత్తమ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర!

ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 0.25 శాతానికి తగ్గడంతో మొండి రుణాల నిర్వహణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) అత్యుత్తమ బ్యాంకు గా నిలిచింది.

Update: 2023-05-28 09:15 GMT

ముంబై: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 0.25 శాతానికి తగ్గడంతో మొండి రుణాల నిర్వహణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) అత్యుత్తమ బ్యాంకు గా నిలిచింది. వార్షిక బ్యాంకు డేటా ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) మాత్రమే కాకుండా రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం కలిగి ఉన్న అన్ని బ్యాంకుల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. మొండి రుణాలకు సంబంధించి పూణెకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర ఎన్‌పీఏ 0.27 శాతంతో రెండో స్థానంలో, 0.37 శాతంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ మూడవ స్థానంలో ఉన్నాయి.

పీఎస్‌బీల్లో బీఓఎం తర్వాత దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ నికర ఎన్‌పీఏ 0.67 శాతంతో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 0.89 శాతం నికర ఎన్‌పీఏను కలిగి ఉంది. రుణాల వృద్ధికి సంబంధించి వార్షిక ప్రాతిపదికన 29.49 శాతం వృద్ధితో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 21.28 శాతంతో రెండో స్థానంలోనూ, 21 శాతం పెరుగుదలతో ఇండస్ఇండ్ బ్యాంక్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఎస్‌బీఐ 15.38 శాతం వృద్ధిని సాధించింది. డిపాజిట్ల వృద్ధి విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 20.80 శాతంతో మొదటిస్థానంలోనూ, ఫెడరల్ బ్యాంక్ 17 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 16.49 శాతం వృద్ధిని కలిగి ఉన్నాయి.

Tags:    

Similar News