గత రెండేళ్లలో బ్యాంక్ మోసాలు 300 శాతం, డిజిటల్ మోసాల్లో 708 శాతం వృద్ధి
విలువ పరంగా రూ. 45,358 కోట్ల నుంచి రూ. 13,930 కోట్లకు తగ్గాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న కొద్దీ అందుకు సంబంధించిన మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2023-24లో మొత్తం 36,075 బ్యాంకు మోసాలు జరిగాయి. ఇది 2022-23లో నమోదైన 9,046 కేసుల కంటే 300 శాతం పెరిగింది. అయితే, విలువ పరంగా రూ. 45,358 కోట్ల నుంచి రూ. 13,930 కోట్లకు తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన బ్యాంకింగ్ మోసాల విలువ 46.7 శాతం తగ్గడం విశేషం. గడిచిన మూడేళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అత్యధిక మోసాలు జరిగాయని, విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం మోసాలకు గురైనట్టు ఆర్‌బీఐ పేర్కొంది. సంఖ్యా పరంగా మోసాలు ప్రధానంగా డిజిటల్ చెల్లింపులు(కార్డ్ చెల్లింపులు, ఇంటర్నెట్)లలో జరిగాయి. విలువ పరంగా ఎక్కువగా రుణాల విభాగంలో జరుగుతున్నాయి. కార్డు, ఇంటర్నెట్ చెల్లింపుల్లో 2022-23లో 3,596 మోసాలు జరగ్గా, 2023-24లో 29,082 మోసాలు జరిగాయి. వీటి విలువ రూ. 155 కోట్ల నుంచి రూ. 1,457 కోట్లకు పెరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది.