ఏప్రిల్‌లో 4 శాతం పడిపోయిన రిటైల్ వాహన అమ్మకాలు!

ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి వాహనాల రిటైల్ అమ్మకాలు 4 శాతం క్షీణించాయి. అందులోనూ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 1 శాతం పడిపోయాయని భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది

Update: 2023-05-04 09:20 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి వాహనాల రిటైల్ అమ్మకాలు 4 శాతం క్షీణించాయి. అందులోనూ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 1 శాతం పడిపోయాయని భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది. గత నెలలో మొత్తం 17.2 లక్షల యూనిట్ల వాహనాలు విక్రయం కాగా, గతేడాది ఇదే నెలలో 17.9 లక్షల యూనిట్ల అమ్ముడయ్యాయని ఫాడా వెల్లడించింది.

పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల వాహన డీలర్‌షిప్‌ల వద్ద వినియోగదారుల ఎంక్వైరీలు పెరిగాయని, మే నెల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫాడా అభిప్రాయపడింది. మిగిలిన వాటితో పోలిస్తే త్రీ-వీలర్ అమ్మకాలు 57 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించింది. ట్రాక్టర్ విక్రయాలు 1 శాతం, కమర్షియల్ వాహనాలు 2 శాతంతో స్వల్పంగా పెరిగాయి. గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన ప్యాసింజర్ విభాగం గత నెలలో నెమ్మదించిందని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు.

ద్విచక్ర వాహనాల విభాగం కరోనా ముందు కంటే 19 శాతం వెనకబడే ఉందని, ఈ విభాగంపై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఫాడా జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ఈ విభాగం మొత్తం ఆటో అమ్మకాల్లో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహన అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడుతుందని ఫాడా పేర్కొంది.

Tags:    

Similar News