భారత్‌లో తయారీకి సిద్ధమైన మరో యాపిల్ సప్లయర్ కంపెనీ
ఫాక్స్‌కాన్‌ను అనుబంధంగా ఉన్న రేప్రస్ టెక్నాలజీస్ హై-క్వాలిటీ ప్రెసిషన్ కెమెరా, లెన్స్‌లను తయారు చేస్తుంది
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ సప్లయర్ కంపెనీల్లో ఒకటైన రేప్రస్ టెక్నాలజీస్ భారత మార్కెట్లో తయారీని ప్రారంభించనుంది. ఇటీవలే గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ, యాపిల్ సప్లయర్ కార్నింగ్ ఇటీవల తమిళనాడులో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కంపెనీ కూడా దేశంలో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. బెంగళూర్‌లోని కెంపెగౌడలో ఫాక్స్‌కాన్ దగ్గరలోనే రేప్రస్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఫాక్స్‌కాన్‌ను అనుబంధంగా ఉన్న రేప్రస్ టెక్నాలజీస్ హై-క్వాలిటీ ప్రెసిషన్ కెమెరా, లెన్స్‌లను తయారు చేస్తుంది. ఫాక్స్‌కాన్‌కు సమీపంలోనే రేప్రస్ తన ప్లాంటు ఏర్పాటు కోసం చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో ఫాక్స్‌కాన్ భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సుమారు రూ. 22.5 వేల కోట్లతో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. 300 ఎకరాల్లో ఏడాదికి 2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను అసెంబుల్ చేసే సామర్థ్యంతో ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్టు ఇదివరకే ప్రకటించింది.