భారత విక్రయాలపై యాపిల్ ప్రత్యేక దృష్టి!
భారత మార్కెట్లో తన ఉనికిని విస్తరించేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక చర్యలు చేపట్టనుంది.
చెన్నై: భారత మార్కెట్లో తన ఉనికిని విస్తరించేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కీలక చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా భారత కార్యకలాపాల్లో మేనేజ్‌మెంట్ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కేవలం మార్కెట్ వాటా పొందడం కాకుండా తమ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి తగిన సన్నాహాలు చేస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అంతేకాకుండా కంపెనీ స్వతంత్రంగా భారత విక్రయాలపై అంతర్గతంగా ట్రాక్ చేయనుంది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, సంస్థ ఇండియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు మాజీ ఉపాధ్యక్షుడుగా ఉన్న హ్యూగ్స్ అసిమన్ పదవీ విరమణ చేసిన తర్వాత ఈ మార్పులు జరుగుతున్నాయి.
ఆయన స్థానంలో ఇండియా హెడ్ ఆశిష్ చౌదరీ బాధ్యతలను తీసుకోనున్నారు. ఆశిష్ చౌదరీ ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తుల విభాగానికి హెడ్ అయిన మైకెల్ ఫెంగర్‌కు వివరాలను అందించనున్నారు. ప్రపంచ యాపిల్ అమ్మకాలకు భారత మార్కెట్ కీలకమైనది. మొత్తం విక్రయాల్లో భారత్ నుంచి ఇటీవల కంపెనీకి రికార్డు ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆఖరు నాటికి యాపిల్ తన రిటైల్ ఔట్‌లెట్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఇటీవల భారత్‌లో పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత మార్కెట్ తమకెంతో ముఖ్యమైనదని అన్నారు. కాగా, ప్రస్తుతానికి యాపిల్ సంస్థ దేశీయంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేస్తోంది..
Also Read...