Amazon: భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యం: అమెజాన్
ప్రస్తుత ఏడాది భారత్ నుంచి సుమారు రూ. 42 వేల కోట్లు విలువైన స్మాల్-టికెట్ వస్తువుల ఎగుమతులు చేయాలని యోచిస్తోంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత మార్కెట్‌ను కీలకంగా చూస్తోంది. చైనా నుంచి నెమ్మదిగా దూరమవుతూ భారత్ నుంచి ఎక్కువ ఎగుమతులను నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుత ఏడాది భారత్ నుంచి సుమారు 5 బిలియన్ డాలర్ల(రూ. 42 వేల కోట్లు) విలువైన స్మాల్-టికెట్ వస్తువుల ఎగుమతులు చేయాలని యోచిస్తోంది. తరచూ కొనుగోలు జరిగే, తక్కువ ఖరీదైన వస్తువులు స్మాల్-టికెట్ వస్తువుల జాబితాలోకి వస్తాయి. 2023లో అమెజాన్ భారత్ నుంచి రూ. 25 వేల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇవి ప్రధానంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు చేరాయి. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఒక్క చైనాపై ఆధారపడకూడదనే గ్లోబల్ కంపెనీల నిర్ణయాన్ని ప్రతిబింబిస్తోంది. అమెజాన్ పోటీ సంస్థ వాల్‌మార్ట్ సైతం భారత్ నుంచి తన ఎగుమతులను 2027 నాటికి రూ. 84 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా ఉంది. 2020లో వాల్‌మార్ట్ భారత్ నుంచి రూ. 25 వేల కోట్ల విలువైన వస్తువుల సరఫరాను నిర్వహించింది. అమెజాన్‌కు ఉన్న అతిపెద్ద వనరులలో భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా వేలాది మంది చిన్న వ్యాపారులతో అనుసంధానం అయ్యేందుకు అమెజాన్ పలు భాగస్వామ్యాలను కలిగి ఉంది. అందులో దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు, ఆయుర్వేద ఉత్పత్తుల వరకు అనేకం ఉన్నాయి. దీన్ని మరింత పెంచేందుకు, అమ్మకాల పెరుగుదలకు దోహదపడేలా నిర్ణయాలు తీసుకుంటామని అమెజాన్ గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్ భూపేన్ వాకంకర్ గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఎగుమతిదారుల సమావేశం అనంతరం పేర్కొన్నారు.