ఈ ఏడాది మరోసారి టారిఫ్ పెంపు ఉండొచ్చు: ఎయిర్‌టెల్!

Update: 2022-02-09 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది ఆఖరులో దేశీయ టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మూడు దిగ్గజ కంపెనీలు సగటున 20 శాతం టారిఫ్ ధరలను పెంచాయి. తాజాగా డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్ సంస్థ, అనంతరం సమావేశంలో ఈ ఏడాదిలో మరోసారి టారిఫ్ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ సంస్థ టారిఫ్ ధరల పెంపు కారణంగా మెరుగైన లాభాలను సాధించింది. దీంతో పాటు గత వారం గూగుల్ సంస్థ పెట్టుబడులు ప్రకటించడం కలిసొచ్చే అంశమని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నెలకు సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) 13 శాతం అధికంగా 163 కి పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది రూ. 200 కి చేర్చాలని భావిస్తున్నట్టు వివరించింది. దీన్ని బట్టి టారిఫ్ ధరల పెంపు తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రకటనతో బుధవారం ఎయిర్‌టెల్ షేర్ ధర 1.55 శాతం పెరిగి రూ. 719.90 వద్ద ట్రేడయింది. 

Tags:    

Similar News