ఉద్యోగులను ఇంటికి సాగనంపడానికి వీఆర్ఎస్ ప్రకటించిన ఎయిర్ ఇండియా!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్‌ను ప్రకటించింది.

Update: 2023-03-17 10:46 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ సంస్థ గతంలోనే ఓసారి వీఆర్ఎస్ అమలు చేసింది. తాజాగా నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి ఈ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది. తాజా రెండవ దశ ఆఫర్ 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న, ఐదేళ్లు సర్వీసును పూర్తి చేసుకున్న శాశ్వత సాధారణ కేడర్‌కు చెందిన అధికారులు, క్లరికల్, అన్‌స్కిల్‌డ్ విభాగాలకు చెందిన వారికి వీఆర్ఎస్ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

దీనికోసం ఆయా ఉద్యోగులు ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరందరికీ ఒకేసారి ఎక్స్‌గ్రేషియా మొత్తం చెల్లించడం జరుగుతుంది. మార్చి 31 కంటే ముందు దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియాతో పాటు అదనంగా రూ. లక్ష ఇస్తామని కంపెనీ వివరించింది. కంపెనీ వర్గాల ప్రకారం, ప్రస్తుతానికి సుమారు 2,100 మంది వరకు తాజా వీఆర్ఎస్ పథకానికి అర్హులని తెలుస్తోంది.

2022 ప్రారంభంలో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను కొన్న టాటా సంస్థ పునర్‌నిర్మాణ చర్యలు మొదలుపెట్టింది. సంస్థను లాభాల్లోకి మార్చడానికి పాత ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా పంపించి, కొత్త వారిని తీసుకోవాలని భావిస్తోంది. అందుకోసం గతేడాది జూన్‌లో మొదటి దశ వీఆర్ఎస్ ప్రక్రియ చేపట్టగా, తాజాగా మరోసారి ప్రకటించింది.

Tags:    

Similar News