రిలయన్స్ బోర్డులోకి వారసులు.. ఆమోదం తెలిపిన షేర్‌హోల్డర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి కొత్త తరం వారసులొచ్చారు.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి కొత్త తరం వారసులొచ్చారు. సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ పిల్లలు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియామకానికి కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. శుక్రవారం సంస్థ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ముఖేశ్ అంబానీ తన వారసత్వ ప్రణాళికలో భాగంగా తన ముగ్గురు సంతానం వ్యాపార బాధ్యతలను తీసుకుంటారని ప్రకటించారు. అందులో భాగంగా ముగ్గురినీ రిలయన్స్ బోర్డు డైరెక్టర్లుగా నియమకానికి వాటాదారుల అనుమతిని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్లకు పంపిన తీర్మానానికి తాజాగా ఆమోదం లభించింది. కవలలు ఈశా, ఆకాశ్ అంబానీలకు 98 శాతానికి పైగా ఓట్లు రాగా, అనంత్‌కు 92.75 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ బోర్డు డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పిల్లలకు బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశ్యంతో ఆమె పూర్తిగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవహారాలను చూసుకుంటున్నారు.