మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి గౌతమ్ అదానీ
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా ప్రపంచ సంపన్నుల జాబితాలో కిందకు పడిపోయిన అదానీ మళ్లీ ఏడాది తర్వాత తిరిగి పొందారు
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సగానికి పైగా సంపదను కోల్పోయిన దేశీయ బిలీయనీర్ గౌతమ్ అదానీ తిరిగి ఎలైట్ క్లబ్‌లో చేరేందుకు ఏడాది పట్టింది. 2023 ప్రారంభంలో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్-5 నుంచి కిందకు పడిపోయిన అదానీ మళ్లీ ఏడాది తర్వాత తన సంపదలో మెజారిటీ మొత్తాన్ని తిరిగి పొందారు. తాజాగా గౌతమ్ అదానీ సంపద కొత్తగా 2.7 బిలియన్ డాలర్లు పెరగడంతో మొత్తం సంపద 100.7 బిలియన్ డాలర్ల(రూ. 8.35 లక్షల కోట్ల)కు చేరింది. గతవారం త్రైమాసిక ఫలితాల్లో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 130 శాతం లాభాలను సాధించడంతో అదానీ సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత అత్యధికంగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం అదానీ ప్రపంచంలోనే 12వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. దేశీయ సంపన్నుడైన ముఖేశ్ అంబానీ కంటే ఒక స్థానం మాత్రమే వెనుకబడి ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో అదానీ సంపద అత్యధికంగా పెరిగినప్పటికీ 2022 నాటి గరిష్ఠ స్థాయి నుంచి ఇంకా 50 బిలియన్ డాలర్ల దిగువనే ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ సంపద 80 బిలియన్ డాలర్ల(రూ. 6.64 లక్షల కోట్ల) క్షిణించి రూ. 3.13 లక్షల కోట్లకి పడిపోయింది. పెట్టుబడిదారులను, వాటాదారుల విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అదానీ గ్రూప్ రుణాలను తిరిగి చెల్లించడం, నియంత్రణా పరమైన సమస్యలను తగ్గించే చర్యలు చేపట్టింది.