ఇంగ్లీష్ వస్తే చాలు ఉద్యోగం చాలా ఈజీ: సర్వే

ఇంగ్లీషులో రాయడం, చదవడం, వినడం, విషయాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తి స్థాయిలో ప్రావీణ్యం ఉన్నట్లయితే వృత్తి పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఒక నివేదిక పేర్కొంది.

Update: 2024-03-12 14:34 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇంగ్లీషులో రాయడం, చదవడం, వినడం, విషయాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తి స్థాయిలో ప్రావీణ్యం ఉన్నట్లయితే వృత్తి పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఒక నివేదిక పేర్కొంది. పియర్సన్ సర్వే ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఇంగ్లీషు మాట్లాడటం, రాయడం వస్తే ఉద్యోగంలో తమ పని చాలా ఈజీగా ఉంటుందని 72 శాతం మంది వ్యక్తులు పేర్కొన్నట్లు తెలిపింది. జపాన్, సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇటలీ, ఫ్లోరిడా (USA) వంటి దేశాల్లో 5,000 కంటే ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నివేదిక ప్రకారం, 85 శాతం మంది వ్యక్తులు తమ పనికి ఇంగ్లీషు చాలా కీలకం అని పేర్కొనగా, 27 శాతం మంది తమ ఉద్యోగాలను చేయడానికి ఇంగ్లీషును ఉపయోగించినప్పుడు తమ అభిప్రాయాలను పూర్తిగా వ్యక్తం చేసినట్లు తెలిపారు. అలాగే, ఉద్యోగంలో 80 శాతం మంది తమ జీతాల పెంపుదల ఇంగ్లీషుతో ముడిపడి ఉందని అన్నారు. 60 శాతం కంటే ఎక్కువ మంది వారానికొకసారి ఇంగ్లీషును ఉపయోగిస్తుండగా, నాలుగింట ఒక పావు వంతు మంది మాత్రమే కార్యాలయంలో ఇంగ్లీష్ చదవడం, వినడం, రాయడం, మాట్లాడటం చేస్తున్నారు.

నివేదిక ప్రకారం, ఇంగ్లీషులో పూర్తి ప్రావీణ్యం ఉన్నవారు తమ ఆదాయంతో పాటు, ఉద్యోగాలతో సంతృప్తిగా ఉన్నారు. సర్వేలో 51 శాతం మంది ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. 40 శాతం మంది ఇంగ్లీష్ భాష ఉన్నత స్థానాలను చేరుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు.


Similar News