85 శాతం మంది రెజ్యూమ్‌లలో తప్పుడు సమాచారం!
ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు చాలా వరకు తమ రెజ్యూమ్‌లలో తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది.
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు చాలా వరకు తమ రెజ్యూమ్‌లలో తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. రిక్రూట్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థ హైర్‌ప్రో(HirePro) నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, దాదాపు 85 శాతం మంది ఉద్యోగార్థులు తమ రెజ్యూమ్‌లలో తప్పుడు వివరాలు అందిస్తున్నారు. దీంతో కంపెనీలు అభ్యర్థులను నేరుగా వ్యక్తిగత ఇంటర్వ్యూ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దశాబ్దం క్రితం రెజ్యూమ్‌లలో తప్పుడు సమాచారం 65 శాతం ఉండగా, ఇప్పుడు అది 85 శాతంగా ఉంది.
40 లక్షల మంది అభ్యర్థుల రెజ్యూమ్‌లు, 3,000 ఉద్యోగాల పోస్టింగ్‌లు, 3,000 మంది నియామక అధికారులు, 500 మందికి పైగా కార్పొరేట్ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నివేదిక వెలువడింది. రిక్రూటర్లలో 70 శాతం మంది రెజ్యూమ్‌లను చదివినప్పటికి కూడా వ్యక్తిగత ఇంటర్వ్యూలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
గత ఐదేళ్ల కాలంలో రిక్రూటర్ల నియామక ప్రక్రియ చాలా వరకు మార్పు చెందింది. నైపుణ్యాల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపికకు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐటీ రంగలో ఈ విధంగా ఎంపికైన వారు 73 శాతం మెరుగ్గా పనిచేశారని సర్వే పేర్కొంది. రాబోయే 18 నెలల్లో నైపుణ్య ఆధారిత నియామకాలు చేపట్టడానికి 75 శాతం కంటే ఎక్కువ మంది రిక్రూటర్లు ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక తెలిపింది.