అనవసర ఖర్చులకు దూరంగా ప్రజలు: పీడబ్ల్యూసీ ఇండియా!

పెరుగుతున్న జీవన వ్యయం, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల కారణంగా దేశీయంగా ప్రజలు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారని ఓ సర్వే తెలిపింది.

Update: 2023-04-06 12:34 GMT

న్యూఢిల్లీ: పెరుగుతున్న జీవన వ్యయం, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల కారణంగా దేశీయంగా ప్రజలు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారని ఓ సర్వే తెలిపింది. దేశీయ వినియోగదారుల్లో 63 శాతం మంది అనవసర ఖర్చులను తగ్గించుకుంటున్నారని పీడబ్ల్యూసీ గ్లోబల్ కన్స్యూమర్ ఇన్‌సైట్స్ సర్వే వెల్లడించింది. దాదాపు 74 శాతం మంది తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

పీడబ్ల్యూసీ సంస్థ దేశంలో 12 మెట్రో, టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి వివరాలను సేకరించింది. భారత వినియోగదారుల్లో ఉన్న ఆర్థిక ఒత్తిడి కి సంబంధించి ఈ సర్వే నిర్వహించామని, 75 శాతం మందిలో ఖరీదైన ఎలక్ట్రానిక్స్, ఇతర లగ్జరీ ఉత్పత్తులను కొనడంలో ఆసక్తి తగ్గిందని పీడబ్ల్యూసీ ఇండియా రిటైల్ అండ్ కన్స్యూమర్ పార్ట్‌నర్ రవి కపూర్ చెప్పారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ఎక్కువగా స్థానిక తయారీ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు.

దాదాపు సగం మంది షాపింగ్ ఖర్చులు పెరిగాయని భావిస్తున్నారు. కావాల్సిన వస్తువులు దొరకడంలో ఇబ్బందులు ఉన్నాయని 28 శాతం మంది చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆరు నెలల్లో ఖర్చులను బాగా తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. 88 శాతం కంటే ఎక్కువ మంది రీసైకిల్, స్థానిక ఉత్పత్తులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News