India Inc: ఒక్క ఏడాదిలోనే ఆర్థిక మోసాలకు గురైన 59 శాతం కంపెనీలు
దేశీయంగా అనేక వ్యాపారాలకు ఆర్థిక మోసాలు ప్రధాన ముప్పుగా మారాయని నివేదిక హైలైట్ చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గడిచిన 24 నెలల్లో ఏకంగా 59 శాతం భారతీయ కంపెనీలు ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నాయని పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 41 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. 'గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ సర్వే-2024' పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 2022లో ఇదే అంశంపై నిర్వహించిన సర్వేలో నమోదైన దానికంటే ఈ ఏడాది ఆర్థిక మోసాలను ఎదుర్కొన్న కంపెనీల సంఖ్య 7 శాతం పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. దేశీయంగా అనేక వ్యాపారాలకు ఆర్థిక మోసాలు ప్రధాన ముప్పుగా మారాయని, 50 శాతం కంపెనీలు దీన్ని ప్రధాన సమస్యగా చూస్తున్నాయని నివేదిక హైలైట్ చేసింది. ప్రపంచ సగటుతో 21 శాతంతో పోలిస్తే ఇది అత్యధికం. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్ మొదటి ఆందోళనగా ఉంది. వ్యాపార కార్యకలాపాల్లో సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు టెక్నాలజీని బలోపేతం చేయడం, విధానాల్లో మార్పులు, సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం వంటి చర్యల ద్వారా అధిగమించవచ్చని పీడబ్ల్యూసీ నివేదిక సూచించింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం, దేశీయంగా కేవలం 44 శాతం కంపెనీలు మాత్రమే ఇటువంటి మోసాలను ఎదుర్కొనేందుకు డేటా అనలిటిక్స్‌ను ఉపయోగిస్తున్నాయని నివేదిక పేర్కొంది.