Indian Economy: భారత వృద్ధి అంచనాను 6.6 శాతానికి పెంచిన ఇండ్-రా
గత మూడు త్రైమాసికాల్లో ఆర్థికవ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది, ఇది డిసెంబర్ త్రైమాసికం నుంచి రివర్స్ అవనుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటును ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రెసెర్చ్(ఇండ్-రా) సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ 6.4 శాతం వృద్ధిని సాధిస్తుందని, ఆ తర్వాత 2025-26లో 6.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే భారత ఆర్థికవ్యవస్థకు పెట్టుబడులు అత్యంత కీలకమైన వృద్ధి చోదకంగా ఉండనున్నాయని ఇండ్-రా అభిప్రాయపడింది. గత మూడు త్రైమాసికాల్లో ఆర్థికవ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది, ఇది డిసెంబర్ త్రైమాసికం నుంచి రివర్స్ అవనుంది. కరోనా మహమ్మారి తర్వాత ద్రవ్య, ఆర్థిక అంశాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ద్రవ్య పరమైన పరిస్థితుల్లో సడలింపు ఉంటుందనే ఆశలు ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2025-26లో కఠిన పరిస్థితులు ఎదురవుతాయనే అంచనాలున్నాయని ఇండ్-రా తెలిపింది. డాలర్ బలపడటం కొనసాగిస్తే భారత ఆర్థికవ్యవస్థకు ఒత్తిడి తప్పదని ఇండ్-రా చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ చెప్పారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.4 శాతంగా ఉండొచ్చని, ఇది గతంలో అంచనా వేసిన 4.9 శాతం కంటే తక్కువ కాబట్టి వృద్ధికి కొంత సానుకూలంగా ఉండనుందని ఇండ్-రా వెల్లడించారు.