PLI పెట్టుబడులతో ఉపాధి కల్పనలో 40% వృద్ధి: పీయూష్ గోయల్

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద వచ్చే పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పన 40 శాతానికి పైగా పెరుగుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు

Update: 2024-09-29 12:18 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద వచ్చే పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పన 40 శాతానికి పైగా పెరుగుతుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆదివారం పీఎల్‌ఐ స్కీమ్‌ల సీఈఓలతో జరిపిన చర్చలో మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా కొత్త పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. దేశంలో ప్రజలకు ఉపాధి అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 0.85 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టితో మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.2 మిలియన్లకు చేరుకుంటుందని మంత్రి అన్నారు. పథకం ద్వారా వచ్చిన కంపెనీల నుంచి ఇప్పటికే సాధించిన రూ.9 లక్షల కోట్లతో పోలిస్తే ఉత్పత్తి కూడా రూ.11 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మేక్ ఇన్ ఇండియా- PLI రెండూ బొడ్డు తాడును కలిగి ఉన్నాయి, వాటిని వేరు చేయడం అసాధ్యం అని గోయల్ అన్నారు. భారతదేశంలో మొదటిసారిగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు మద్దతును అందించడాన్ని కూడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని చెప్పారు. దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని, స్థానిక కొనుగోళ్లను మరింత పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం 1,300 యూనిట్లు పనిచేస్తున్న 14 రంగాల్లో PLI పథకాలను అమలు చేస్తోంది.


Similar News