21 లక్షల సిమ్ కార్డుల రద్దుకు టెలికాం విభాగం చర్యలు
దీనికి సంబంధించి టెలికాం కంపెనీలను అలర్ట్ చేసినట్టు వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి 21 లక్షల సిమ్ కార్డులు జారీ చేసినట్టు తమ పరిశోధనలో తేలిందని టెలికాం విభాగం(డీఓటీ) ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్‌లను అలర్ట్ చేసినట్టు వెల్లడించింది. అనుమానాస్పదంగా ఉన్న నంబర్ల వివరాలను కంప్నీఎలకు అందజేసి వాటిని తక్షణమే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు డీఓటీ పేర్కొంది. అవన్నీ నకిలీ అని తేలితే రద్దు చేయాలని స్పష్టం చేసింది.
సంచార్ సాథీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల సిమ్ కార్డుల కనెక్షన్‌లను డీఓటీకి చెందిన ఏఐ విశ్లేషించింది. అందులో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ చేసుకునేందుకు నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించినట్టు గుర్తించింది. అందులోని చాల అవాటిని సైబర్ నేరాలకు వాడుతున్నట్టు సందేహాలున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఆ సిమ్ కార్డులను రద్దు చేయడమే కాకుండా, వాటిని వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను కూడా పని చేయకుండా చేయనున్నట్టు ఏఐ అండ్ డీఐయూ డైరెక్టర్ జనరల్ ముఖేష్ మంగళ్ వివరించారు.
దేశంలోని 1.92 కోట్ల మంది తొమ్మిది సిమ్ కార్డుల పరిమితి దాటి కనెక్షన్లను కలిగి ఉన్నారు. వారిలో చాలామందికి సంబంధించిన డేటా తప్పుగా ఉంది. ఈ నంబర్ల గురించి దర్యాప్తు, ఇతర చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలకు డీఓటీ గడువి నిర్దేశించింది. ప్రజలకు తెలియకుండా వారి పేర్లతోనే సిమ్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేసేందుకు డీఓటీ సంచార్ సాథీ కార్యక్రమం నిర్వహిస్తోంది.