Gold: 18 క్యారెట్ల పసిడికి భారీ గిరాకీ

ఎక్కువమంది 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

Update: 2025-01-08 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం బంగారం కొనాలంటే మధ్యతరగతి నుంచి సామాన్యుల వరకు అదిరిపడుతున్నారు. గడించిన ఏడాది కాలంలోనే పసిడి ఏకంగా పావు వంతు పెరిగిన నేపథ్యంలో వివాహాలు, వేడుకలకు మినహా సాధారణ కొనుగోలుకు చాలా దూరంగా ఉంటున్నారు. అయితే, ఆభరణాల తయారీలో ఎక్కువ ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 72 వేలకు పైన ఉంది. దీంతో ఎక్కువమంది 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పరిశ్రమ వర్గాల ప్రకారం, 2024లో 18 క్యారెట్ల ఆభరణాల డిమాండ్ 25 శాతం పెరిగింది. ముఖ్యంగా 18 క్యారెట్ల పసిడిలో రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ కోసం యువత ఎక్కువ ఇష్టపడుతున్నారని ఆభరణాల తయారీదారులు చెబుతున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు 225 టన్నుల 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇది 2023 నాటి(180 టన్నుల)తో పోలిస్తే 25 శాతం పెరిగింది. అంతకుముందు కాలంలో సాధారణంగా 18 క్యారెట్ల పసిడికి 5-10 శాతం వరకే డిమాండ్ ఉండేదని ఆల్ ఇండియ జెమ్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డె చెప్పారు. దేశంలో 22 క్యారెట్ల బంగారం ఏటా 500-550 టన్నుల మధ్య ఉంటుంది. 22 క్యారెట్ల కంటే 18 క్యారెట్లలో తరుగు ఎక్కువగా ఉండటం వల్ల బలంగా ఉంటాయి. ఈ కారణం కూడా ఆభరణాల్లో కొత్త డిజైన్లు వస్తున్నాయి. వాటిని యువత కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రాజేష్ పేర్కొన్నారు. కాగా, బుధవారం దేశీయ మార్కెట్లో 18 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 59120 వద్ద ఉంది. 22 క్యారెట్లు పది గ్రాములు రూ. 72,250గా ఉంది. 18, 22 రెండు రకాలూ హాల్‌మార్క్‌తో వస్తాయి. బంగారం స్వచ్ఛతపై ఆందోళన ఉండదు. 

Tags:    

Similar News