చెత్త పాలైన కోట్ల రూపాయలు
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ బిట్ కాయిన్ విలువ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ బిట్‌కాయిన్ విలువ దాదాపుగా పాతిక లక్షలకు పైగానే ఉండటంతో, మొదట్లో చాలా తక్కువ ధరలకు కొని, అది ఎందుకు పనికి వస్తుందిలే అని లైట్ తీసుకున్న ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీ ప్రారంభమైన వేళ వాటిని కొనుగోలు చేసిన స్టీఫెన్ థామస్ దాని పాస్‌వర్డ్ మరిచిపోగా, రూ.1715 కోట్లు నష్టపోనున్న విషయం ఇటీవలే మనం చెప్పుకున్నాం. ఇలా పాస్‌వర్డ్ మరిచిపోయిన […]
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ బిట్ కాయిన్ విలువ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ బిట్‌కాయిన్ విలువ దాదాపుగా పాతిక లక్షలకు పైగానే ఉండటంతో, మొదట్లో చాలా తక్కువ ధరలకు కొని, అది ఎందుకు పనికి వస్తుందిలే అని లైట్ తీసుకున్న ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీ ప్రారంభమైన వేళ వాటిని కొనుగోలు చేసిన స్టీఫెన్ థామస్ దాని పాస్‌వర్డ్ మరిచిపోగా, రూ.1715 కోట్లు నష్టపోనున్న విషయం ఇటీవలే మనం చెప్పుకున్నాం. ఇలా పాస్‌వర్డ్ మరిచిపోయిన బ్యాచ్‌లో చాలామందే ఉండగా, బ్రిటన్‌కు చెందిన ఐటీ వర్కర్ జేమ్స్ హోవెల్స్ కథ మరోలా ఉంది. తన క్రిప్టోకరెన్సీ ఐరన్ కీని తన హార్డ్‌వేర్‌లో పెట్టుకోగా, దాన్ని చెత్తలో పడేశాడు. దాంతో చెత్తకుప్పలను గాలించడమే కాకుండా, అది దొరికిన వాళ్లు తిరిగిస్తే లక్షల బహుమతి ఇస్తానంటూ ప్రకటనలు ఇచ్చాడు.
బ్రిటన్‌లోని న్యూపోర్ట్‌కు చెందిన జేమ్స్ హోవెల్స్ ఐటీ ఉద్యోగి. తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని బిట్ కాయిన్లు కొనడానికి వెచ్చించాడు. అలా హోవెల్స్ మొత్తంగా 7,500 యూనిట్ల క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయగా, వాటికి సంబంధించిన ఐరన్ కీని తన హార్డ్‌వేర్ డిస్క్‌లో భద్రపరిచాడు. అయితే అనుకోకుండా ఆ డిస్క్ చెడిపోవడంతో, కొత్త డిస్క్‌ను తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ డిస్క్‌ను ఓ మూలన పడేశాడు. ఇంట్లోని చెత్త క్లీన్ చేయగా, తన పాడైపోయిన హార్డ్ డిస్క్‌ను చెత్తతో పాటే పడేశాడు. తాజాగా బిట్‌కాయిన్స్ విలువ పెరుగుతుండటంతో, హోవెల్స్‌కు తన క్రిప్టో కరెన్సీ గుర్తుకు వచ్చింది. తన కంప్యూటర్‌లో చూస్తే, వాటికి సంబంధించిన ఏ సమాచారం లేకపోవడంతో చెడిపోయిన హార్డ్ డిస్క్‌లోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందని భావించాడు. అయితే ఆ హార్డ్ డిస్క్ పడేయడంతోనే హోవెల్స్‌కు పెద్ద చిక్కువచ్చి పడింది. దాంతో ఆ పాత డిస్క్‌ను వెతికేపనిలో పడ్డాడు. తన పాత హార్డ్ డిస్క్ దొరికిన వారికి లక్షల్లో బహుమతి ఇస్తానని ప్రకటించడంతో పాటు, న్యూపోర్ట్ సిటీ డంపింగ్ యార్డ్ మొత్తం వెతికి తన హార్డ్ డ్రైవ్‌ను బయటకు తీస్తే 25 శాతం బిట్ కాయిన్లు సిటీ కౌన్సిల్‌కు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. అయితే ఇంతపెద్ద ఆఫర్‌కు సిటీ కౌన్సిల్ ఒప్పుకోకపోవడం గమనార్హం.
హోవెల్స్ డంప్ యార్డ్‌లో తన హార్డ్‌వేర్ కోసం వెతకడం ఇదేం తొలిసారి కాదు. 2013లో బిట్ కాయిన్ విలువ 150 డాలర్ల నుంచి 1,000 డాలర్లకు పెరిగినప్పుడు, అతని వాలెట్ విలువ 6 డాలర్ల మిలియన్లకు చేరుకుంది. దాంతో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తన హార్డ్ డ్రైవ్ వెతికినా, లాభం లేకపోయింది. మరోసారి బిట్‌కాయిన్ విలువ రైజ్ కావడంతో తన దగ్గరున్న బిట్‌కాయిన్ల విలువ 273 మిలియన్ డాలర్లు చేరుకుంది. దాంతో మరోసారి చెత్తపాలైన తన హార్డ్‌వేర్ కోసం హోవెల్స్ గాలిస్తున్నాడు. ఈసారి హోవెల్స్ ఓ కొత్త ప్రణాళికతో ముందుకు వెళుతున్నాడు. గ్రిడ్ రిఫరెన్స్ వ్యవస్థ ఆధారంగా పల్లపు ప్రాంతంలోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని తవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవేళ డ్రైవ్ దొరికితే, డేటా రికవరీ నిపుణుల సాయంతో డ్రైవ్‌ను రికవరీ చేసి, బిట్‌కాయిన్స్ యాక్సెస్ చేయడానికి డేటా ఫైల్‌లను తిరిగి పొందొచ్చని హోవెల్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. హోవెల్స్ తన డ్రైవ్ దొరికి, క్రిప్టోకరెన్సీ పొందితే పంతొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల(రూ. 19,97,74,57,500) రూపాయలను సొంతం చేసుకోవచ్చు.