మెదక్‌లో యథేచ్ఛగా ఇటుక బట్టీల దందా

దిశ ప్రతినిధి, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటుక బట్టీల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా జోరుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇండ్లు నిర్మించుకోవడంతో ఇటుక బట్టీలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో అడ్డగోలుగా ఇటుక బట్టీలు వెలిశాయి. ఇందులో కొన్నింటికి మాత్రమే అనుమతి ఉండగా, సగానికి పైగా ఇటుక బట్టీలను అనుమతి లేకుండానే కొనసాగిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్న చూసిచూడనట్టు వ్యవహరిస్తుండటంపై […]

Update: 2021-02-08 13:11 GMT

దిశ ప్రతినిధి, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటుక బట్టీల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా జోరుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇండ్లు నిర్మించుకోవడంతో ఇటుక బట్టీలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో అడ్డగోలుగా ఇటుక బట్టీలు వెలిశాయి. ఇందులో కొన్నింటికి మాత్రమే అనుమతి ఉండగా, సగానికి పైగా ఇటుక బట్టీలను అనుమతి లేకుండానే కొనసాగిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్న చూసిచూడనట్టు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీల దందా జోరుగా కొనసాగుతున్నది. వ్యవసాయ క్షేత్రాలను అడ్డాలుగా చేసుకొని రైతులకు నెలనెలా డబ్బులు చెల్లిస్తూ ఎలాంటి అనుమతి లేకుండానే ఇటుక బట్టీలను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం, అర్బన్ మండలం, తుప్రాన్, రాజక్కపేట, చీకోడ్, కమ్మరపల్లి, రామేశ్వరంపల్లి, చిన్నశంకరంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, నార్సింగి, నారాయణఖేడ్, హుస్నాబాద్, తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీల దందా జోరుగా కొనసాగుతున్నది. వీటి నిర్వహణకు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర , ఒడిషా, దూర ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించుకొని మరీ దందా కొనసాగిస్తున్నారు.

కానరాని నిబంధనలు

జిల్లాలో ఎక్కడా కూడా ఇటుక బట్టీలు నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. ఇటుక బట్టీల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్న అవేమి లేకుండా యథేచ్ఛగా ఇటుక బట్టీలను కొనసాగిస్తున్నారు. ఓ వైపు ఇటుకకు కావాల్సిన మట్టినిసైతం వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమంగా ఇసుకను, మట్టిని తరలిస్తున్నారు. పైగా ఒక్కో ఇటుకకు రూ. 5-10 చొప్పున వసూలు చేస్తూ లక్షలు గడిస్తూ అక్రమ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. అందులో పనిచేసే సిబ్బందికి మాత్రం సరైన వేతనం అందించక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతుల వద్ద లీజుకు తీసుకున్న భూములకు సైతం చాలా తక్కువ రేటు కట్టిస్తున్నట్టు సమాచారం.

పట్టించుకోని అధికారులు

ప్రభుత్వ అనుమతి లేని ఇటుక బట్టీలు విచ్చలవిడిగా వెలుస్తున్నా సంబంధిత అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వ్యాపారుల నుంచి సంబంధిత అధికారులకు ప్రతి నెలా కొంత డబ్బులు అందుతున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇటుక బట్టీ దందాను నివారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News