జార్ఖండ్ సీఎం అరెస్ట్.. తదుపరి సీఎం ఈయనే !
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బుధవారం రాత్రి రాష్ట్ర రాజధాని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బుధవారం రాత్రి రాష్ట్ర రాజధాని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసంలో దాదాపు గంటపాటు ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈవివరాలను హేమంత్ సోరెన్ రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన ఎంపీ మహువా మజీ మీడియాకు ధ్రువీకరించారు. హేమంత్ సోరెన్ అరెస్టయిన వెంటనే జేఎంఎం ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. వారంతా కలిసి హేమంత్ సోరెన్ సన్నిహితుడు చంపై సోరెన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలని గవర్నర్‌ను కోరారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కోసం సమయం కేటాయించాలని అభ్యర్ధించారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంపై సోరెన్ ఇప్పటివరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ‘‘మేం చంపై సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నాం. ప్రమాణ స్వీకారోత్సవం కోసం గవర్నర్‌ను అభ్యర్థించాం’’ అని రాష్ట్ర మంత్రి బన్నా గుప్తా తెలిపారు. ‘‘కొత్త శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ ఠాకూర్ అన్నారు.
ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ కంప్లయింట్
ఇక అరెస్టు కావడానికి ముందు హేమంత్ సోరెన్ రాంచీ పోలీసులకు ఈడీపై ఫిర్యాదు ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలపై రాంచీలోని ఎస్సీ/ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. దీంతో ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘‘కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై మేం ముఖ్యమంత్రి నుంచి ఫిర్యాదును స్వీకరించాం. అణగారిన వర్గానికి చెందిన తనను ఈడీ ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని ఫిర్యాదులో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఈడీ అధికారులు అవమానించేలా చేసిన దాడుల వల్ల మానసిక వేదనకు గురయ్యానని ప్రస్తావించారు’’ అని రాంచీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ చందన్ కుమార్ సిన్హా మీడియాకు వివరించారు.